సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ) (జనవరి 23, 1897 ) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా,జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యంను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారత దేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణం లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోను సాగింది.
బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రాంభించాడు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా పెషావర్ చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్‌ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్‌తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVD అతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్‌కు రిబ్బెన్‌ట్రాప్ నుండి, మరియు విల్‌హెల్మ్‌స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.
తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన Special Operations Executive (SOE) ఈ పనిని చేపట్టింది.
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీ గా ఉండగా సైబీరియా లో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబందాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.
అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్ కు లేఖను పంపడం జరిగింది.
ఈ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006 లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమీషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమీషన్ నివేదికను తిరస్కరించింది.
1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివశించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్న బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు.
భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది.ఏదైనప్పటికి భగవాన్ జీ జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి